Telangana Polls: రేపే ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రేపు కీలక ఘట్టానికి తెరలేవనుంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు విడుదల చేయనుంది.
By అంజి Published on 2 Nov 2023 4:54 AM GMTTelangana Polls: రేపే ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రేపు కీలక ఘట్టానికి తెరలేవనుంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు విడుదల చేయనుంది. నోటిఫికేషన్ వెలువడడంతోనే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 10వ తేదీ వరకు పరిశీలిన, 15వ తేదీతో ఉపసంహరణ గడువు పూర్తవుతుంది. అనంతరం ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది తేలిపోనుంది.
నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం బృందం బుధవారం సమీక్షించింది. ఇప్పటి వరకు జరిగిన ఫూల్ ప్రూఫ్ ఏర్పాట్లను, రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతను తెలుసుకోవడానికి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్‌లతో కూడిన బృందం న్యూఢిల్లీ నుండి వచ్చింది. ఎన్నికలకు సంబంధించి వారు అనేక సూచనలు ఇచ్చారు. మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేసి పోజిషన్‌లను తీసుకోవాలని కోరారు.
ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లను ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అదనపు సీఈవో లోకేష్ కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవో సత్యవాణి కేంద్ర బృందానికి వివరించారు. కేంద్ర ఎన్నికల బృందంతో జరిగిన ఇతర సమీక్షా సమావేశాల్లో డీజీపీ అంజనీకుమార్, వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు.
ఉచితాలపై, నామినేషన్ల ఆమోదం తర్వాత సంబంధిత అభ్యర్థుల ఖాతాలో ధరను జోడించాలని ఈసీ బృందం సీఈవోని ఆదేశించింది. కీలక పోలింగ్ కేంద్రాల్లో నిఘా కెమెరాల ఏర్పాటు పరిస్థితిని శర్మ అడిగి తెలుసుకున్నారు. సీనియర్ సిటిజన్లు, పీడబ్ల్యూడీ ఓటర్లు తమ ఇళ్లలో కూర్చొని ఓటు వేయాలనుకునే వారి కోసం పోస్టల్ బ్యాలెట్ల కోసం నిర్దేశిత ఫారమ్‌లను ముందుగానే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.