తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈవో) కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గత రెండు రోజులుగా ఆయనకు జ్వరం వస్తుండడంతో అనుమానంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పరీక్షల్లో తొలుత నెగెటివ్‌గా వచ్చింది. మందులు వేసుకుంటున్నా జ్వరం తగ్గకపోవడంతో పట్టణంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చెస్ట్ స్కాన్ చేయించుకోవడంతో అందులో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వారం రోజుల పాటు దర్శనాలు బంద్..
ఈవో కరోనా బారిన పడడంతో నేటి నుంచి వారం రోజుల పాటు ఏడుపాయల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు మెదక్ ఆర్డీఓ సాయిరాం వెల్లడించారు. అయితే.. అమ్మవారికి చేసే పూజలు, అభిషేకాలు తదితరాలు యధాతదంగా కొనసాగుతాయని.. భక్తులను మాత్రం ఆలయంలోకి అనుమతించమని చెప్పారు. మార్చి 25 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు చెప్పారు. అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఏడుపాయలలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బందికి, పూజారులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
అయితే.. గత వారమే ఇక్కడ జాతర జరిగింది. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు శివరాత్రి ఉత్సవాలకు హాజరై ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. ఇప్పుడు వారందరిలోనూ టెన్షన్ నెలకొంది.