నేటి నుంచి టెట్ అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్.. వారికి మాత్రం అకౌంట్లలోకి డబ్బులు
తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది.
By అంజి Published on 11 April 2024 1:13 AM GMTనేటి నుంచి టెట్ అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్.. వారికి మాత్రం అకౌంట్లలోకి డబ్బులు
తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈ నెల 20 వరకు తమ దరఖాస్తుల్లోని తప్పులను సవరించుకోవచ్చని తెలిపింది. ఈ నెల 9వ తేదీ నాటికి 1,93,135 దరఖాస్తులు రాగా, గతంతో పోల్చితే అప్లికేషన్లు తక్కువగా రావడంతో గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ గడువు రోజుల్లో అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మొన్నటి వరకు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పేపర్-1కు 72,771, పేపర్-2కు 1,20,364 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. తాజాగా గడువు పెంచడంతో పలువురు దరఖాస్తు చేసుకుంటున్నారు. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. టెట్ రాసే అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
టెట్ -2024, డీఎస్సీ కోసం ఫీజు చెల్లించి అనర్హులైన అభ్యర్థులకు ఫీజును తిరిగి ఇస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అభ్యర్థుల ఆధార్‌తో లింక్ అయిన ఉన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్టు తెలిపింది. 50,206 మందికి ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 44,690 మందికి చెల్లించినట్టు పేర్కొంది. డబ్బులు జమ కాని వారు కమిషనర్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆధార్ లింకై ఉన్న అకౌంట్ వివరాలు ఇవ్వాలని సూచించింది.