క్యాసినో లెక్కలు తీస్తున్న ఈడీ!

ED Questions Chikoti Praveen. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న క్యాసినో వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కూపీ లాగుతోంది.

By సునీల్  Published on  1 Aug 2022 2:41 PM GMT
క్యాసినో లెక్కలు తీస్తున్న ఈడీ!

చికోటి ప్రవీణ్ తీగ లాగితే కదులుతున్న డొంకలు

తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న క్యాసినో వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కూపీ లాగుతోంది. సొమ్ములున్న వారు లక్షలు వెదజల్లి జూదం ఆడటానికి నేపాల్, శ్రీలంక తదితర దేశాలతోపాటు, గోవాలోనూ క్యాసినోలు ఉన్నాయి. సంక్రాంతి సమయంలో కృష్ణా జిల్లా గుడివాడలో స్థానిక ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని) క్యాసినో నిర్వహించారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పరిశోధన చేసిన నివేదికను గవర్నర్‌కు అందజేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ, తెలంగాణలకు చెందిన పలువురు మంత్రులు, మాజీలు, ఎమ్మెల్యేలు నేపాల్‌లో క్యాసినోకు వెళ్లారనే ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. అసలు ఇదంతా చికోటి ప్రవీణ్ అనే టూర్ ఆపరేటర్, క్యాసినో మీడియేటర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిఘా పెట్టడంతో వెలుగులోకి వచ్చింది. చికోటి ప్రవీణ్‌తోపాటు మాధవరెడ్డి గతంలో టూర్ ఆపరేటర్లుగా ఎంతమందిని క్యాసినోలకు తరలించారో, పన్నులు కట్టకుండా ఎన్ని లావాదేవీలు నిర్వహించారో కూపీ లాగుతోంది. ఇప్పటికే ప్రవీణ్, మాధవరెడ్డి నివాసాల్లో సోదాలు చేసిన ఈడీ పలు ఆధారాలు సేకరించింది. వాటి ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులతోపాటు, పలు రంగాల ప్రముఖులతో ప్రవీణ్, వారి గ్యాంగ్‌కు పరిచయాలున్నట్లు గుర్తించింది. అక్కడ లభించిన ఆధారాలతో ఏపీ, తెలంగాణల్లోని ఎనిమిది చోట్ల ఈడీ దాడులు చేసి లెక్కలు వారి తేలుస్తోంది.

గత వారం సోదాలు జరిపి, ఆధారాలు సేకరించిన ఈడీ సోమవారం విచారణకు దిగింది. ఈడీ కార్యాలయానికి ప్రవీణ్‌ను పలు ప్రశ్నలు వేస్తూ.. అతడి గ్యాంగ్‌కు ఉన్న పరిచయాలు, జరిగిన లావాదేవీలపై సమాధానాలు రాబడుతోంది. ఇదిలా ఉంటే ప్రవీణ్ మాత్రం తనకేమీ కాదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ తనను ఈ కేసుల్లో నిందితుడిగా బుక్ అయితే.. చాలా మంది పెద్దల పేర్లు బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరికలు చేస్తున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వారంతా ఎప్పుడు ఎవరి పేరు బయట పడుతుందా అని ఉత్కంఠతో చూస్తున్నారు. అదే సమయంలో ప్రవీణ్‌తో పరిచయం ఉన్న రాజకీయ, సంపన్న వర్గాల్లో మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని, ఏ విచారణ అయినా జరిపించుకోవచ్చని వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం గుడివాడ క్యాసినో నుంచి, నేపాల్ క్యాసినో వరకు లెక్కలు తీయాల్సిందేనని పట్టుబడుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీతోపాటు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగాలని డిమాండ్ చేస్తోంది. మొత్తానికి క్యాసినో వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో ఎప్పుడు, ఎవరి పేరు వస్తుందా అన్న ఆసక్తిని రేపుతోంది.


Next Story