Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు మరోసారి సమన్లు.. అరుణ్‌పిళ్లైకి కస్టడీ పొడిగింపు
మార్చి 20న విచారణలో పాల్గొనాల్సిందిగా ఈడీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి సమన్లు పంపింది.
By అంజి Published on 16 March 2023 4:14 PM IST
ఎమ్మెల్సీ కవితకు మరోసారి సమన్లు.. అరుణ్‌పిళ్లైకి కస్టడీ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను తప్పించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. కవితకు దర్యాప్తు సంస్థ మార్చి 20న హాజరుకావాలంటూ మరోసారి సమన్లు జారీ చేసింది. గురువారం కవిత రెండవ సారి ఈడీ ఎదుట హాజరుకావాలి ఉంది. అయితే.. ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్ల లేదు. అనారోగ్యం, సుప్రీం కోర్టులో కేసు కారణంగా ఈడీ విచారణకు హజరుకాలేకపోతున్నట్లు ఈడీకి లేఖ రాశారు. మరో తేదీని నిర్ణయించాలని, ఆరోజు తప్పక హజరు అవుతానని కోరారు.
గత విచారణలో ఈడీ అడిగిన పత్రాలను తన న్యాయవాది ద్వారా అధికారులకు పంపారు కవిత. ఈ క్రమంలోనే మార్చి 20న విచారణలో పాల్గొనాల్సిందిగా ఈడీ ఆమెకు మరోసారి సమన్లు పంపింది. ఇదిలా ఉంటే.. బుధవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఆడిటర్, సౌత్ గ్రూప్ సభ్యుడు బుచ్చిబాబు వాంగ్మూలాన్ని ఈడీ రికార్డు చేసింది. ఈ కేసులో తన పేరును అనవసరంగా లాగుతున్నారని, ఈ కేసులో సీబీఐ, ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను తాను ఎప్పుడూ కలవలేదని కవిత పేర్కన్నారు. అయితే ఎక్సైజ్ పాలసీ కేసులో సౌత్ గ్రూపు ప్రతినిధుల్లో కవిత కూడా ఒకరని ఈడీ పేర్కొంది.
మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్‌పిళ్లై కస్టడీ ముగియడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. రౌస్ అవెన్యూ కోర్టులో అతడిని హాజరుపరిచారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిళ్లైని మరికొందరితో కలిసి ప్రశ్నించాల్సి ఉందని ఈడీ వాదనలు వినిపించింది. కొందరు నిందితులు, సాక్షులను కలిపి జరుపుతున్న విచారణ ఇంకా పూర్తి కాలేదని, ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత కూడా నేడు విచారణకు హాజరుకాలేదని, ఈ పరిస్థితుల్లో పిళ్లై కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. దీంతో మరో 3 రోజుల పాటు పిళ్లై కస్టడీని పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.