తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో రాజసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్.. తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్ వెలువడింది.
ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. ఈ నెల 20న నామినేషన్ల స్కృూట్నీ నిర్వహించనున్నారు. ఈ నెల 23న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఈ నెల 30న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ను నిర్వహించారు. జూన్ 1న తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇదిలా ఉంటే.. ఈ స్థానానికి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకత్వం ఎవరితో భర్తీ చేస్తుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ లో ఆశావాహులు చాలా మంది ఉన్నారు. అయితే ఈ పదవి ఎవరికి దక్కుతుందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. వచ్చే ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.