నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. పరుగులు తీసిన జనం

Earthquake of 3.1 magnitude hits Nizamabad. దేశంలో ఇటీవల భూకంపాలు తరచూ సంభవిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో ఆదివారం

By అంజి  Published on  5 Feb 2023 11:25 AM IST
నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. పరుగులు తీసిన జనం

దేశంలో ఇటీవల భూకంపాలు తరచూ సంభవిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో ఆదివారం నాడు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు మైదాన ప్రాంతాల వైపు పరుగులు తీశారు. నిజామాబాద్‌కు వాయువ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఆదివారం రిక్టర్‌ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. ఆదివారం ఉదయం 8:12 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో, 19.43 అక్షాంశం, 77.27 రేఖాంశం మధ్యలో భూకంపం సంభవించింది. అయితే భూకంపం వల్ల ప్రాణ నష్టం లేదా ఆస్తినష్టం గురించి ఇంకా సమాచారం లేదు.

మహారాష్ట్రలోని నాందేడ్‌కు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. అయితే నిజామాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భూకంపం రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుసార్లు భూమి కంపించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. జనవరి 24 న, మంగళవారం ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. కనీసం 15 సెకన్ల పాటు భూకంపం సంభవించింది. ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయాల నుండి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం నేపాల్‌లో కేంద్రీకృతమై ఉంది.


Next Story