భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం కొద్దిసేపు భూమి కంపించింది. భూకంపాలతోపాటు చిన్నపాటి శబ్ధాలు కూడా వినిపించాయి. సరిగ్గా 2 గంటల 13 నిమిషాలకు పాల్వంచలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైంది. భూమి కంపించడంతో ఇళ్లలోని వస్తువులు కింద పడిపోయాయి. కొన్ని చోట్ల గోడలు కూడా కూలిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంపం వచ్చిన కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయడంతో.. గందరగోళ పరిస్థితి నెలకొంది. కాసేపటి తర్వాత అంతా మమూలు స్థితికి చేరుకున్నాక.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూకంపం వచ్చినప్పుడు ఇంట్లో ఉండకుండా బయటకు రావాలని సూచించారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 16న ఏపీలోని చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రాత్రి 10 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది.
చిత్తూరు జిల్లాలోని పలమనేరు, గంగవరం, కీలపట్ల, గంటూరు, బండమీద జరావారిపల్లి తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇటీవల ఉత్తర భారత్‌లో కూడా పలుసార్లు భూకంపాలు సంభవించాయి.