ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన భద్రతా ఏర్పాట్ల కోసం వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆయన డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. జడ్చర్ల మండలం గంగాపూర్ సమీపంలో డీఎస్పీ ప్రయాణిస్తున్న పోలీసు వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అధికారిక వాహనం తీవ్రంగా దెబ్బతింది. డీఎస్పీ స్వల్ప గాయాలతో తప్పించుకోగా, ఆయన డ్రైవర్ కానిస్టేబుల్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇద్దరినీ జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు.
డీఎస్పీ తన పోలీస్ ఇన్నోవా వాహనంలో సీఎం పర్యటన ముగించుకొని మహబూబ్‌నగర్‌కు వస్తున్న క్రమంలో జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామం సమీపంలో మరో వాహనం ఢీకొట్టింది. డీఎస్పీకి, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జడ్చర్ల ఆసుపత్రిని సందర్శించి డీఎస్పీ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ క్షేమంగా ఉన్నారని, డ్రైవర్ హైదరాబాద్‌లో ప్రత్యేక వైద్య సంరక్షణలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.