బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని కేటీఆర్‌కు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. కులగణనపై బీఆర్ఎస్ నాయకులు పదే పదే విమర్శలు చేయడం మానుకోవాలని ఆమె హితవు పలికారు. 50 రోజుల పాటు సమగ్ర సర్వే కొనసాగినా.. కేటీఆర్ కుటుంబం సర్వేలో పాల్గొనలేదని, పైగా ప్రభుత్వాన్ని నిందించడమేంటని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే అధికారుల పర్యవేక్షణలో జరిగిందని అన్నారు.
బీసీ డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై సీఎం రేవంత్ రెడ్డితో రిజర్వేషన్లపై చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని అన్నారు. త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని ఆమె తెలిపారు. మరో నాలుగో రోజుల్లో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపైనా ప్రకటన వస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. కులగణన నివేదికపై బీసీల్లో ఎక్కడా సంతృప్తి లేదని.. కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో లేనిపోని అనుమానాలను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కులగణనపై బీసీలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా.. ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.