మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన డీఎంకే ఎంపీలు

DMK MP'S meet Minister KTR.తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌‌ను త‌మిళ‌నాడు అధికార

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Oct 2021 1:09 PM IST
మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన డీఎంకే ఎంపీలు

తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌‌ను త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీలు బుధ‌వారం క‌లిశారు. నీట్ రద్దు చేయాలనే డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని పలువురు సీఎంల‌కు తమిళనాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ రాసిన లేఖను ఈ సంద‌ర్భంగా వారు మంత్రికి అంద‌జేశారు. మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన వారిలో ఎంపీలో ఇళంగోవ‌న్‌, క‌ళానిధి వీర‌స్వామి త‌దిత‌రులున్నారు.

డీఎంకే ఎంపీ ఇళంగోవ‌న్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీట్‌ పరీక్ష ర‌ద్దు అంశంపై మేము కోరుతున్నామ‌న్నారు. కేంద్ర విధానంపై నిరసన వ్యక్తం చేస్తున్నామని, మాకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు చెప్పారు. కీలకమైన అంశాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేద‌న్నారు. మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిపారు.

ఇదే అంశంపై టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. నీట్‌ రద్దు అంశంపై ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్‌.. కేసీఆర్‌కు లేఖ రాశార‌ని.. అందుకు మద్దతు కోసం డీఎంకే ఎంపీలు మంత్రి కేటీఆర్‌ను కలిశారన్నారు. లెటర్‌ తీసుకొచ్చి కేటీఆర్‌కి స్వయంగా అందించి మద్దతు అడిగారు అని ఎంపీ రంజిత్‌ రెడ్డి తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే నీట్ ర‌ద్దు కోరుతూ 12 మంది ముఖ్య‌మంత్రుల‌కు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే.

Next Story