Telangana: అసెంబ్లీలో డీకే అరుణకు చేదు అనుభవం
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు చేదు అనుభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2023 1:17 PM ISTTelangana: అసెంబ్లీలో డీకే అరుణకు చేదు అనుభవం
గద్వాల అసెంబ్లీ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కృష్ణమోహన్‌రెడ్డి గెలిచారు. అయితే.. ఆయన ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికల సమయంలో ఆయన తప్పుడు పత్రాలు సమర్పించారని ప్రత్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి తీర్పు వెల్లడించింది. అంతేకాదు.. కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ.. డీకే అరుణ గద్వాల ఎమ్మెల్యే అని తెలిపింది. ఈ క్రమంలో కోర్టు తీర్పు కాపీ అందించింది. తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ డీకే అరుణ శుక్రవారం అసెంబ్లీకి వెళ్లారు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు చేదు అనుభవం ఎదురైంది.
బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఎమ్మెల్యే రఘునందన్‌తో కలిసి అసెంబ్లీకి వెళ్లార. గద్వాల అసెంబ్లీ ఎన్నికపై హైకోర్టు తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందించేందుకు వెళ్లారు. అయితే.. ఆ సమయంలో కార్యదర్శితో పాటు అసెంబ్లీ స్పీకర్ కూడా అందుబాటులో లేకపోవడంతో.. డీకే అరుణ సహా బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గద్వాల ఎమ్మెల్యేగా కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆగస్టు 24న తీర్పు వెల్లడించిందని.. ఆర్డర్ కాపీతో అసెంబ్లీకి వస్తే స్పీకర్, కార్యదర్శి ఎవరూ అందుబాటులో లేరని డీకే అరుణ అన్నారు. ముందు రోజు ఫోన్ చేశానని.. మెసేజ్ కూడా పెట్టానని చెప్పారు. రోజూ అసెంబ్లీలో ఉండే కార్యదర్శి ఇవాళ మాత్రం ఎందుకు రాలేదని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కార్యదర్శిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి ఉందని అనుమానం వ్యక్తం చేశారు డీకే అరుణ. ముందుగా సమాచారం ఇచ్చినా.. స్పీకర్, కార్యదర్శి ఇద్దరూ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అయితే.. కోర్టు ఆర్డర్ కాపీని స్పీకర్ పేషీలో ఇచ్చినట్లు డీకే అరుణ వెల్లడించారు. అసెంబ్లీ స్పీకర్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి తీర్పుని అమలు చేయాలని డీకే అరుణ కోరారు. ముందే తీర్పు వచ్చి ఉంటే నాలుగేళ్లలో గద్వాల చాలా అభివృద్ధి చెంది ఉండేదని.. కానీ తీర్పు ఆలస్యమైందని అన్నారు డీకే అరుణ. దీనిపై ఎన్నికల సంఘం అధికారులను కూడా కలుస్తామని.. హైకోర్టు తీర్పుని కచ్చితంగా అమలు చేసేలా చూస్తామని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.