సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ కింద రూ.93,750లను నేడు అకౌంట్లలో జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకోసం సింగరేణి రూ.358 కోట్లను విడుదల చేసిందని చెప్పారు. సంస్థలో పని చేస్తున్న 42 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.93,750 లు అందుతాయని పేర్కొన్నారు. గత ఏడాది చెల్లించిన దీపావళి బోనస్ కన్నా ఇది రూ.50 కోట్లు అధికం అని భట్టి విక్రమార్క వివరించారు. ఇవాళ మధ్యాహ్నం సమయానికి దీపావళి బోనస్‌ను కార్మికుల ఖాతాల్లో జమ చేయున్నారు.
బొగ్గు ఇండస్ట్రీ కోసం జేబీసీసీఐ విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్‌ను చెల్లించే పద్ధతి గత కొన్ని ఏళ్లుగా అమలులో ఉంది. ఈ సంవత్సరం కూడా కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న డెసిషన్‌కు అనుగుణంగా దీపావళి పండుగగకు ముందే బోనస్ అందేలా డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇటీవలే సింగరేణి ఉద్యోగులకు 33 శాతం లాభాల వాటా కింద రూ.796 కోట్లను కంపెనీ పంపిణీ చేసిందని సింగరేణి ఎండీ తెలిపారు.