డబ్బులు ఇవ్వాలని అభ్యర్థించాడు.. మాట వినలేదు.. చివరికి.!
District Consumer Commission fined Paytm
By అంజి Published on 17 Oct 2021 12:20 PM ISTఇప్పుడు ప్రతీది డిజిటల్‌మయం అయిపోయింది. ఏటీఎం వెళ్లి డబ్బులు తీసుకునే పని లేకుండా.. నేరుగా మన ఫోన్ ద్వారానే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా డబ్బులు ట్రాన్సాక్షన్‌లు జరుపుతున్నాం. ఏదైనా వస్తువు కొనాలన్న ఎక్కడికో వెళ్లకుండా ఈ యాప్‌లలోనే బుక్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే అప్పడప్పుడు ఈ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లో సమస్యలు ఎదురవుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పేటీఎంకు రూ.25 వేలు జరిమానా విధించింది జిల్లా వినియోగదారుల కమిషన్. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్‌కు చెందిన వివేక్‌దీక్షిత్ క్వికర్‌లో ఓ వస్తువు బుక్ చేశాడు. దీని కోసం పేటీఎం ద్వారా రూ.6,865లను బదిలీ చేశాడు. తర్వాత ఆ వస్తువు నచ్చకపోవడంతో ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు.
డబ్బులు తిరిగి చెల్లించాలని పేటీఎం సంస్థను కోరాడు. అయితే ఆ సంస్థ నుండి వచ్చిన డబ్బు అతని బ్యాంక్ అకౌంట్‌లో జమ కాలేదు. దీంతో క్వికర్‌తో పాటు, పేటీఎం, బ్యాంకు అధికారులను సంప్రదించాడు. పేటీఎం అకౌంట్‌లోకి డబ్బులు మళ్లించిన విషయం తెలుసుకున్న వివేక్.. ఆ సంస్థ దృష్టికి తీసుకువెళ్లాడు. వారు ఎంతకు పట్టించుకోకపోవడంతో వివేక్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. వివేక్ వాదనలతో కమిషన్ ఏకీభవించింది. అతనికి రూ.6,865 తిరిగి చెల్లించడంతో పాటు పేటీఎంకు రూ.25 వేలు జరిమానా విధించింది. కేసు ఖర్చుల కింద రూ.1000 ఇవ్వాలని ఆదేశించింది.