హైదరాబాద్: ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని పాల్గొన్నారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సింగరేణికి 2,412 కోట్ల రూపాయల లాభం వచ్చింది. లాభాల్లో 33 శాతం అంటే రూ.796 కోట్లను కార్మికులకు బోనస్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కార్మికుడిగా సగటున రూ.1.9 లక్షల బోనస్‌గా రానుంది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి మాట్లాడారు. సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల పట్ల మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. అలాగే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల జీతాలను పెంచే విషయాన్ని పరిశీలించాలని, సింగరేణి ఉద్యోగులకు పెన్షన్‌ను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రిటైర్ట్ ఉద్యోగులకు మెడికల్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5 వేలు బోనస్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.