తల్లిదండ్రులు బలవంతంగా ఆశ్రమ పాఠశాలలో చేర్పించారని మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ఆదివారం చోటుచేసుకుంది. హాసిని అనే 15 ఏళ్ల విద్యార్థిని తల్లిదండ్రులు ఆమెను రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్పించారు. చాలా కాలంగా తల్లిదండ్రులు తన వద్దకు రాకపోవడంతో ఆమె బెంగపెట్టుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హాసిని పాఠశాల పై అంతస్తు నుంచి దూకి కుడి కాలు విరిగింది.
గాయపడిన విద్యార్థిని పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధ్యాపకులు, విద్యార్థులు హాసినిని భవనంపై నుంచి దూకకుండా ఉండేందుకు ఎంతగానో ఒప్పించేందుకు ప్రయత్నించారు. స్థానికులు, ఉపాధ్యాయులు ఎంత వారించినా వినలేదు. అందరూ చూస్తుండగానే కిందికి దూకేసింది. చివరకు విద్యార్థినిని కాపాడేందుకు దుప్పట్లు పట్టి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ దుప్పటి చిరిగి పోవడంతో విద్యార్థిని కుడికాలు ఎముక విరిగింది. బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మరోవైపు విద్యార్థిని ఆత్మహత్య యత్నించడానికి ప్రధాన కారణం.. చదువు ఇష్టం లేకపోవటమేనని చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన సమాచారం తెలియడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వెంటనే బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నారు.