గుడ్‌న్యూస్.. జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
By అంజి
గుడ్‌న్యూస్.. జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన చికిత్స అందించేందుకు వీలుగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ప్రత్యేక నంబర్‌తో అనుసంధానం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను ఇవ్వనున్నట్టు ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్‌లో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నాడు జరిగిన సత్కార సభలో మంత్రి మాట్లాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం, ప్రజలు గర్వించేలా పనిచేస్తామన్నారు. ఆధార్ నంబర్ తరహాలో ఒక్కో పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యను ఇస్తామన్నారు.
పేరు ఎంటర్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన వైద్య సేవల వివరాలు తెలుస్తాయని, ఏ డాక్టర్‌ను సంప్రదించినా వెంటనే ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుని వైద్యం చేసేందుకు వీలు ఉంటుందని పేర్కొన్నారు. తన తండ్రి శ్రీపాదరావు మరణం అనంతరం సోనియాగాంధీ తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. తన తల్లి జయశ్రీ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించాలంటే చాలా సహనం ఉండాలన్నారు. మంథని ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.