అక్బరుద్దీన్‌కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా?.. కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఫైర్‌

అక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు

By అంజి
Published on : 7 July 2025 4:42 PM IST

Hydraa, Akbaruddin, Union Minister Bandi Sanjay, Telangana government

అక్బరుద్దీన్‌కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా?.. కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఫైర్‌

అక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు, వ్యాపారాలు చేసుకుంటున్న అక్బరుద్దీన్ ఒవైసీ కుటుంబానికి మినహాయింపు ఇచ్చారా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. అక్బరుద్దీన్ కాలేజీలో 10 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నందున అక్రమ నిర్మాణాలైనా వాటిని కూల్చలేమని చెబుతున్న హైడ్రా అధికారులు.. ఏ జీవనాధారం, గూడు లేక మూసీ పరివాహక ప్రాంతాల్లో కట్టుకున్న గుడిసెల్లో, చిన్న చిన్న ఇళ్లను ఎందుకు కూల్చివేశారని బండి సంజయ్‌ నిలదీశారు.

'అక్బరుద్దీన్ కుటుంబానికే విలువ ఉంటుందా? పేదల ప్రాణాలకు, జీవితాలకు విలువ లేదా? వాళ్లు మనుషులు కాదా? ఎంఐఎం నాయకులు పోలీసులను కొడితే చర్యలు తీసుకోరు. కరెంట్ బిల్లులు కట్టకుంటే వత్తాసు పలుకుతారు? ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేస్తే వత్తాసు పలుకుతారు? ఆఖరికి తీవ్రవాదులతో సంబంధాలున్న వాళ్లకు ఉద్యోగాలిచ్చి పోషిస్తుంటే పట్టించుకోరు? ఇదేం పద్దతి..''అంటూ మండిపడ్డారు.

మీడియాపై దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏం చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. 'రేవంత్ రెడ్డిగారు.. మీకు పౌరుషం లేదా? మిమ్ముల్ని ఆకారణంగా జైల్లో వేసి బెయిల్ రాకుండా చేశారు కదా? అవన్నీ మర్చిపోయి వాళ్లతో కుమ్కక్కైపోయారా? కాళేశ్వరం, ఈ ఫార్ములా సహా అనేక స్కామ్‌లు చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు' అని బండి సంజయ్‌ నిలదీశారు.

ప్రజాస్వామ్యాన్ని, మీడియా స్వేచ్ఛను కాపాడే విషయంలో బీజేపీ ముందుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు ‘‘మీకు దమ్ముంటే ఏబీఎన్, ఆంధ్రజ్యొతిపై దాడులు చేసి చూడండి. మీరు దాడి చేసిన రెండే రెండు గంటల్లోనే మీ బీఆర్ఎస్ ఆఫీస్ ను, అందులోని టీవీ ఛానల్ సంగతిని మా బీజేవైఎం నాయకులు చూస్తారు.’’ అని స్పష్టం చేశారు.

Next Story