ఎమ్మెల్యే ఇంటి ముందు గల్ఫ్‌ కార్మికుడి మృతదేహాంతో ధర్నా

Dharna under Gulf JAC with dead body in front of Vemulawada MLA Ramesh Babu house. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కథలాపూర్ మండలం

By అంజి  Published on  14 Feb 2023 11:30 AM GMT
ఎమ్మెల్యే ఇంటి ముందు గల్ఫ్‌ కార్మికుడి మృతదేహాంతో ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన వలసకార్మికుడు లంకదాసరి వెంకటేష్ అనారోగ్యంతో ఇటీవల దుబాయిలో మృతిచెందాడు. దుబాయిలోని సామాజిక సేవకుడు గుండెల్లి నర్సింలు చొరవతో వెంకటేష్ శవపేటిక మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నది. దుబాయి నుంచి వచ్చిన మృతుని శవపేటికను.. మృతుని స్వగ్రామం గంభీర్ పూర్‌కు అంబులెన్సులో తరలించారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో వేములవాడలో ఎమ్మెల్యే రమేష్ బాబు ఇంటిముందు శవపేటికను అంబులెన్స్ నుండి కిందికి దింపి గల్ఫ్ కార్మికులు ధర్నా చేశారు.

ఈ సంఘటన వేములవాడ పట్టణంలో జరిగింది. ఈ సందర్బంగా గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ తో సహా మరికొందరు కార్మిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పినాడని అన్నాడు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని ఎగవేశారని అన్నారు. అధికార బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనికి పూర్తి బాధ్యత వహించాలని అందుకే ఎమ్మెల్యే ఇంటి ముందు గల్ఫ్ అమరునికి శాంతియుతంగా నివాళులు అర్పించామని అన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై పోరాడటంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాని రవిగౌడ్ అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఇంటిముందు కూడా ఇదేవిధంగా చేస్తామని ఆయన అన్నారు.

ఉత్తర తెలంగాణలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికులు, గ్రామాలలోని వారి కుటుంబ సభ్యులు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాల్లో స్థిరపడ్డ గల్ఫ్ రిటనీ కార్మికులతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రవిగౌడ్ అన్నారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి (ఎస్సీ), ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో త్వరలో సమావేశాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.

Next Story