రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి అని అన్నారు. ఈనెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో అనుభవం ఉన్న సర్జన్‌తోనే 34 మంది మహిళలకు కు.ని ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు.
ఆపరేషన్ చేయించుకున్న వారు కొద్ది గంటలు మాత్రమే ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందన్నారు. వీరిలో నలుగురు మృతి చెందారన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. కాజ్ ఆఫ్ డెత్ కోసం నలుగురికి పోస్ట్ మార్టం నిర్వహించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల నష్టపరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే వారికి డబుల్ బెడ్‌రూమ్‌లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. స్పెషల్ మెడికల్ టీమ్ మిగతా 30 మంది ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఏడుగురిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించామని, మరో ఇద్దరు మహిళలను నిమ్స్‌కు తరలించినట్లు డీహెచ్ చెప్పారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేవి రెగ్యులర్‌గా చేసేవే అని అన్నారు. గతేడాది కూడా 502 కు.ని ఆపరేషన్ క్యాంపులు నిర్వహించామని, గతేడాది వరకు లక్షన్నరకు పైగా కు.ని ఆపరేషన్లు జరిగాయన్నారు. కాగా.. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశామని, అలాగే ఆపరేషన్ చేసిన వైద్యుడి లైసెస్సును రద్దు చేసినట్లు డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.