నిజామాబాద్ సిసిఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్‌ను హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిజాయతీగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. వాహనాల దొంగతనాలను, చైన్ స్నాచింగ్ నేరాలను చేస్తున్న నిందితుడు షేక్ రియాద్ ఆచూకీ సమాచారం లభించిన వెంటనే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి హత్య చేసి పరారైన నిందితున్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. మల్టీ జోన్ _1 ఐజిపి శ్రీ చంద్రశేఖర్ రెడ్డిని సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, వారికి అవసరమైన సహాయం చేయాలన్నారు. లభించిన ఆధారాలను బట్టి, గాలింపు చేపట్టాలని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని డిజిపి తెలియజేశారు.