రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఏ.రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం. మహేందర్‌రెడ్డి ఎడమ భుజంపైన బోన్ విరగడంతో ఫిబ్రవరి 18 నుంచి మెడికల్ లీవ్ తీసుకుంటున్నట్లు గురువారం స్పష్టం చేశారు. తన ఇంట్లో జారి పడి గాయాలు అయ్యాయని, ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ రిపోర్టులను పరిశీలించిన వైద్యులు మూడు ఫ్రాక్చర్‌లను నిర్ధారించారని ఓ ప్రకటనలో తెలిపారు. పగుళ్లను నయం చేయడానికి వైద్యులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఫిబ్రవరి 18 నుండి మార్చి 4 వరకు మెడికల్ లీవ్ లో ఉన్నానని తెలిపారు.
తిరిగి వైద్యుల సలహా మేరకు విధుల్లో చేరుతున్నట్లు తెలిపిన మహేందర్‌రెడ్డి, వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ ఫిజియోథెరపీ, ఇతర వ్యాయామాలు చేస్తున్నట్టు తెలిపారు. తనను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపిందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ రాష్ట్ర శాఖకు నేతృత్వం వహిస్తున్న రేవంత్‌రెడ్డి వాస్తవాలను ధృవీకరించకుండా తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం పోలీసు అధికారుల పేర్లను రేవంత్ రెడ్డి ఉపయోగించుకోవడాన్ని మహేందర్ రెడ్డి ఖండించారు. ఈ తప్పుడు ప్రకటనలు పోలీసు శాఖ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. సీనియర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, ఇతర అధికారులపై ఎలాంటి ప్రకటనలు చేసే ముందు సంయమనం పాటించాలని రేవంత్ రెడ్డిని కోరారు.