నిరుద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ సభ్యులను నియమించామని, త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు ప్రకటిస్తామని తెలిపారు. శనివారం రోజు చిలుకూరులో పర్యటించిన భట్టి విక్రమార్క.. ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు. ఆ పార్టీకి త్వరలోనే దిమ్మతిరిగే సమాధానం చెబుతామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఉండాలని, అందుకే ధర్నా చౌక్‌ను తెరిపించాం అనిపేర్కొన్నారు.
మరోవైపు టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డితో పాటు మరో ఐదుగురు సభ్యుల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న టీఎస్సీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ క్రమంలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కీలక ముందడుగు పడ్డట్టయింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో వివిధ వర్సిటీల పరిధిలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్లను నియమించింది. ఆయా విశ్వవిద్యాలయాల ఉపకులపతులను సంప్రదించి ఈ మేరకు కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.