హైదరాబాద్: యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రస్తుతం మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. జూన్ 2వ తేదీ నుంచి కేటగిరీని బట్టి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
రాజీవ్ యువ వికాసం కింద ప్రభుత్వం అందించే సబ్సిడీని రెండు దశల్లో విడుదల చేయనున్నట్టు భట్టి విక్రమార్క చెప్పారు. పథకం మంజూరు అయ్యాక కొంత మొత్తం, స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తాన్ని రిలీజ్ చేస్తామన్నారు. లబ్ధిదారులకు 3 నుంచి 15 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కోసం 16.25 లక్షల మంది అప్లై చేసుకున్నారు.
ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ మొత్తం వ్యయంలో 60 నుంచి 80 శాతం ప్రభుత్వం రాయితీ అందించనుంది. రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు 60 శాతం రాయితీ, రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ ఇవ్వనున్నారు. రూ.50 వేల రుణాలకు సంబంధించి చిన్న యూనిట్లకు, చిన్న నీటిపారుదల పథకాలకు అందించే రుణాలకు బ్యాంకు లింక్‌తో సంబంధం లేకుండా 100 శాతం రాయితీ అందించనున్నారు.