'విద్యుత్‌ సరఫరాపై నెట్టింట తప్పుడు వార్తలు'.. నమ్మొద్దన్న డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా విషయమై సోషల్ మీడియాలో వ‌స్తున్న తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By అంజి  Published on  30 Jan 2024 4:46 AM GMT
విద్యుత్‌ సరఫరాపై నెట్టింట తప్పుడు వార్తలు.. నమ్మొద్దన్న డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా విషయమై సోషల్ మీడియాలో వ‌స్తున్న తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2023 డిసెంబర్, 2024 జ‌న‌వ‌రి నెలల్లో గతంలో కంటే ఎక్కువ‌ విద్యుత్తు స‌ర‌ఫ‌రా జ‌రిగింద‌ని వివరించారు. తెలంగాణలో విద్యుత్ సరఫరా గతంతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. 2022 సంవత్సరం డిసెంబర్ నెలలో సగటున ప్రతి రోజు 200 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగితే, 2023 డిసెంబర్ నెలలో సగటు 207.7 మిలియన్ యూనిట్లకు పెరిగిందని ఉప ముఖ్యమంత్రి వివరించారు.

అట్లే, 2024 జనవరి 1 నుండి 28 వరకు, రాష్ట్రంలో రోజుకి సగటున 242.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా తమ ప్రభుత్వం చేస్తే గత ఏడాది ఇదే కాలానికి సగటున 226 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేశారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వ‌చ్చే నెల నుండి ఏప్రిల్ 2024 వరకు విద్యుత్తు డిమాండ్‌ను తీర్చడానికి ఇప్పటికే తగిన‌ చర్యలు తీసుకున్నామ‌ని డిప్యూటీ సీఎం తెలిపారు.

వ‌చ్చే వేస‌విని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా వివిధ రాష్ట్రాల‌తో జ‌రిగిన ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్తును ముంద‌స్తుగా రిజ‌ర్వు చేసుకున్నామ‌ని చెప్పారు. ఆ రాష్ట్రాల‌లో విద్యుత్తు కొర‌త ఉన్న‌ప్పుడు తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రాలో ఎలాంటి అంత‌రాయం లేకుండా ముంద‌స్తుగా నిర్వహణ ప‌నులు కూడ చేప‌ట్టామ‌న్నారు. విద్యుత్ సరఫరా విషయంలో సోషల్ మీడియాలో వ‌స్తున్న తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని, 2023 డిసెంబర్, 2024 జనవరి నెలల్లో గతంలో కంటే ఎక్కువ‌గా విద్యుత్తు స‌ర‌ఫ‌రా జ‌రిగింద‌ని పునరుద్ఘాటించారు.

Next Story