హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ 2025-26 ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కొత్త ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో పౌర సరఫరాల శాఖకు రూ.5,734 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా మంది పేదలు కొత్త రేషన్ కార్డు కోసం ఆసక్తిగా ఎదురు చూశారని, కానీ గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని భట్టి అన్నారు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను రేషన్ కార్డులో చేర్చలేదని అన్నారు.
"ప్రజల ఆకాంక్షలను గుర్తించి, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, వారికి బియ్యం కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈ సంవత్సరం జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది" అని డిప్యూటీ సీఎం తెలిపారు.