Telangana: గుడ్‌న్యూస్.. రూ.50,000 లోపు రుణాలకు వంద శాతం రాయితీ
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి
Telangana: గుడ్‌న్యూస్.. రూ.50,000 లోపు రుణాలకు వంద శాతం రాయితీ
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనిట్లను నాలుగు కేటగిరీలుగా విభజించింది. అలాగే రాయితీ నిధుల వాటాను పెంచింది. పథకం అమలును పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం మెరుగైన నిబంధనలు రూపొందిస్తోంది. తాజాగా వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో యూనిట్ల వ్యయం, సబ్సిడీ వాటాను ఖరారు చేశారు. ఈ పథకం కింద ఈబీసీలకు యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈబీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్టు సమాచారం. రేపు ఈ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి నిబంధనలను ప్రభుత్వం జారీ చేయనుంది. సమావేశం సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ''యువత జీవితాల్లో మార్పు తీసుకురావడానికి రాజీవ్ యువ వికాస పథకం తీసుకువచ్చాం. ఈ పథకం విజయవంతం చేయడానికి అధికారులు అంకితభావంతో, పవిత్ర యజ్ఞంలా పనిచేయాలి. రాజీవ్ యువ వికాస పథకానికి నిధుల సమస్యనే లేదు. జూన్ 2 నుంచి స్వయం ఉపాధి పథకాల మంజూరి పత్రాలు అందజేస్తాం'' అని తెలిపారు.
సెల్ఫ్ ఎప్లాయిమెంట్ కింద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఈ పథకం కింద రూ.50 వేల రుణాన్ని అందించనుంది. వీరికి 100 శాతం రుణ రాయితీని కల్పించనుంది. అలాగే రూ.లక్షలోపు యూనిట్లకు గతంలో 80 శాతం రాయితీ ఉండగా.. ఇప్పుడు 90 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రూ.1 నుంచి 2 లక్షల్లోపు వ్యయం కలిగిన యూనిట్లకు 80 శాతం రాయితీ లభించనుంది. రూ.2 నుంచి 4 లక్షల యూనిట్లకు 70 శాతం రాయితీ లభించనుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే యువతకు మెరుగైన ఆర్థిక సహకారం అందించేందుకు ప్రభుత్వం సబ్సిడీ వాటా పెంచింది.