హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ పెట్టిన బకాయిలు రూ.1300 కోట్లు ఉన్నాయన్నారు. తొలుత రూ.10 లక్షల లోపు బిల్లులను సెటిల్ చేసే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ బకాయిల విలువ దాదాపు రూ.400 కోట్లు ఉందని తెలిపారు.
సర్పంచ్‌లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డితో పాటు తానూ గమనించి ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులతో పనులు చేయించి బిల్లులను పెండింగ్‌లో పెట్టిందన్నారు. సర్పంచ్‌లను, ఎంపీటీసీలను గత ప్రభుత్వం వీధిపాలు చేసిందని భట్టి విమర్శించారు. బిల్లులను పెండింగ్‌లో పెట్టిన బీఆర్‌ఎస్ నేతలు మళ్లీ ధర్నాలు చేస్తామనడం సమంజసం కాదన్నారు. ఈ విషయమై బీఆర్‌ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.