హైదరాబాద్: ప్రజాభవన్‌లో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో చర్చలు విజయవంతంగా ముగిశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వారి బకాయిలలో ఇప్పటికే 600 కోట్లు విడుదల చేశామన్నారు. మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామని, మిగిలిన 300 కోట్లు కూడా త్వరలో క్లియర్ చేస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసి, యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి అవసరమైన సంస్కరణలను చర్చిస్తామన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా వ్యవస్థ స్థిరత్వం కోసం కట్టుబడి ఉంటుందన్నారు.
ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేనని కానీ సీఎం కార్యాలయం అధికారులపై, డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని FATHI అధ్యక్షుడు నిమ్మటూరి రమేష్ తెలిపారు. తాము మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయన్నారు. తమ మాటలను వక్రీకరిస్తూ మీడియాలో వచ్చిన ప్రకటనల పట్ల తమ సంఘం నుంచి ఒక ఖండన ప్రకటనను ఇప్పటికే అంశాన్ని ఉన్నతాధికారులకు పంపడం జరిగిందన్నారు.
''మూడవ తారీకు నుంచి సమ్మెకు వెళ్లాం ఫలితంగా కొన్ని పరీక్షలు నిర్వహించలేకపోయినందుకు చింతిస్తున్నాం. నిలిచిపోయిన పరీక్షలను యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన నిర్వహించే ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వంతో చర్చలు సఫలం అయినందున రేపటి లెక్చరర్ల ప్రదర్శనను రద్దు చేసుకుంటున్నాం'' అని చెప్పారు.