నిరుద్యోగులకు శుభవార్త..రూ.6 వేలకోట్లతో స్వయం ఉపాధి పథకం, రేపే ప్రారంభం

నిరుద్యోగ యువతకు స్వయం ఉఫాధి కల్పించేలా రేపు వనపర్తిలో రూ.6 వేల కోట్లతో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని భట్టి తెలిపారు.

By Knakam Karthik
Published on : 1 March 2025 8:14 AM IST

Telangana News, Deputy Cm Bhatti, Employment Schemes, CM RevanthReddy

నిరుద్యోగులకు శుభవార్త..రూ.6 వేలకోట్లతో స్వయం ఉపాధి పథకం, రేపే ప్రారంభం

ప్రపంచాన్ని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉఫాధి కల్పించేలా రేపు వనపర్తిలో రూ.6 వేల కోట్లతో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని భట్టి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. రుణాల మంజూరుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో స్కిల్స్‌ యూనివర్సిటీ, ఐటీఐల ఉన్నతీకరణ, నైపుణ్యమున్న మానవ వనరులు, నిరంతర నాణ్యమైన విద్యుత్తు సరఫరా, చక్కటి శాంతి భద్రతలు, మంచి వాతావరణం కల్పించామని తెలిపారు. దావోస్‌లో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. ప్రాంతీయ రింగ్‌ రోడ్డు పూర్తయితే రాష్ట్రంలోకి పెట్టుబడులు మరింతగా వెల్లువెత్తుతాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రుణమాఫీ, రైతు భరోసా ఇతర పథకాలకు రూ.52,000 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. గ్రామాలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగా వృద్ధి సాధిస్తుందన్నారు. మహిళలతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టడానికి ఉద్దేశించిన ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేసేందుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. కోటి మంది జనాభా ఉండే హైదరాబాద్‌ మహా నగరంలో మహిళలకు ఆర్థిక చేయూతనిస్తామని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమివ్వాలని సూచించారు.

Next Story