హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ లాబ్ ప్రారంభిస్తామని తెలిపారు. సింగరేణి ఆసుపత్రుల్లో మార్చి నాటికి వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ చేస్తామని వెల్లడించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
సింగరేణిపై అసెంబ్లీలో పలువురు సభ్యుల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానం ఇచ్చారు. 32 మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని వాటిని త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే 176 మంది పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతోందన్నారు. రామగుండంలో క్యాత్ ల్యాబ్ నిర్మాణం పీపీపీ మోడల్‌లో చేపడుతున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ అవార్డు పూర్తయిందని, 75 రోజుల్లో ప్రారంభిస్తామని..డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.