కుత్బుల్లాపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత.. స్థానికుల ఆగ్రహం
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అధికారులను అడ్డుకున్న స్థానికులు ఆత్మహత్యకు యత్నించారు.
By అంజి Published on 16 Dec 2023 6:47 AM GMTకుత్బుల్లాపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత.. స్థానికుల ఆగ్రహం
హైదరాబాద్: నగరంలో అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు ఇవాళ ఉదయం నుండి కొరడా ఝళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో కైసర్ నగర్‌లోని 307,342,329 , దేవేందర్ నగర్ లోని 307 (ఎసిఎఫ్ సి) ప్రభుత్వ సర్వేనెంబర్ లలో వెలిసిన అక్రమ కట్టడాలను సైతం జేసిబిలతో కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా ఆర్ డి ఓ శ్యామ్ ప్రకాశ్ గుప్తా మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా కుత్బుల్లాపూర్ పరిధిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రాగా, వాటిపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ దాదాపు ఉదయం నుండి 200 రూంలను కూల్చివేశామని, మిగతా వాటిని కూడా పూర్తిగా కూల్చి వేస్తామని తెలిపారు.
ప్రభుత్వ భూముల్లో చిన్న చిన్న రూములు కట్టి,పేదలకు విక్రయిస్తున్న కబ్జాదారుల పై కేసులు పెడుతున్నామని, వారిపై పీడీ యాక్ట్ లు నమోదు చేయాలని పోలీసులను కోరామని అన్నారు. మండల పరిధిలో గత కొన్ని నెలలు గా కబ్జాలు జరుగుతున్నా కూడా రెవెన్యూ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు అడగగా.. అందుకు జిల్లా రెవెన్యూ అధికారి మాట దాటి వేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి అక్రమ కట్టడాల మధ్య కరెంట్ మీటర్లు, స్తంభాలు మంజూరు చేసిన విద్యుత్ అధికారుల ను ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేయగా, ఎవ్వరూ కూడా స్పందించడం లేదని వారిపై ఉన్నత అధికారులకు సైతం ఫిర్యాదు చేస్తామని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా మరోవైపు అక్రమ కట్టడాలను కూలగొడుతూ ఉంటే స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్ళను కూల కొట్టొద్దు అంటూ అధికారులను అడ్డుకున్నారు. మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా వచ్చి ఇల్లు కూలగొడితే తాము ఎక్కడికి వెళ్తామంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలు అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు..ఈ క్రమంలో స్థానికుల్లో కొందరు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.