తెలంగాణలో పునర్విభజన ద్వారా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు తక్షణ ప్రతిపాదన లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ డిమాండ్ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ప్రస్తుతం ఉన్న 119 సీట్లను 153కి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే రాష్ట్ర విభజన ఫలితంగా అసెంబ్లీ సీట్లను పెంచాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి చెప్పారు.
దేశంలో డీలిమిటేషన్ జరుగుతున్నప్పుడు కాశ్మీర్‌లో సరిహద్దులు లేనందున గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేశారు. వీటిలో 43 నియోజకవర్గాలు జమ్మూ ప్రాంతంలోనూ, 47 నియోజకవర్గాలు కశ్మీరు ప్రాంతంలోనూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను ఉదాహరణగా చూపుతూ సీట్లు పెంచాలని డిమాండ్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రాజ్యాంగ సవరణలు అవసరమని కిషన్ రెడ్డి అంటున్నారు. 2026లో కొత్త జనాభా లెక్కల తర్వాతే ఇది సాధ్యమవుతుందని.. 2031లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందన్నారు.