నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఎమ్మెల్సీ కవిత భర్త!
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆమె భర్త ఇవాళ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.
By అంజి Published on 18 March 2024 7:14 AM ISTనేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఎమ్మెల్సీ కవిత భర్త!
ఢిల్లీ: ఇప్పుడు రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న తన సోదరి కె.కవితను మార్చి 17, ఆదివారం నాడు బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ ఏజెన్సీ కార్యాలయంలో కలిశారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను నిన్న తొలిరోజు విచారణ అనంతరం ఆమె భర్తతో పాటు కేటీఆర్, హరీశ్ రావు కలిశారు. ఇవాళ పలువురు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆమె భర్త ఇవాళ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఆమెను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది.
46 ఏళ్ల కవితను శుక్రవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసం నుంచి అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. మరుసటి రోజు ఆమెను ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజరుపరచగా, ఆమెను మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి పంపింది. కవితను ఈడీ కస్టడీకి పంపుతున్న సమయంలో, ఆమె రిమాండ్ వ్యవధిలో ప్రతిరోజూ సాయంత్రం 6-7 గంటల మధ్య ఆమెను కలిసేందుకు సోదరుడు కేటీఆర్, భర్త అనిల్ డితో సహా కొంతమంది బంధువులను కోర్టు అనుమతించింది. తెలంగాణ శాసనమండలి సభ్యురాలు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుమార్తె కవితను శనివారం ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఎదుట హాజరుపరిచారు. ఆమెను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమెను సీఎం అయితే ఏం చేస్తారు అని ప్రశ్నించగా ఆమె స్పందించారు. తాను ముఖ్యమంత్రి అయితే మద్యాన్ని నిషేధిస్తానని, ఇది కొంచెం కష్టమే అయినా కచ్చితంగా చేస్తానని చెప్పారు.