ఎవరి మరణం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టం. ఓ విద్యార్థిని ఏడు నెలల్లో మూడు సార్లు పాము కాటుకు గురైంది. రెండు సార్లు మృత్యువుతో పోరాడి విజయం సాధించింది. అయితే.. మూడో సారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బెదోడ గ్రామంలో బాలేరావు సుభాష్–రంజన దంపుతులు నివసిస్తున్నారు. వీరి ఏకైక కుమారై ప్రణాళి(18) ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతోంది.
గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రణాళి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటువేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సుమారు రూ.4లక్షల వరకు చేసి ప్రణాళి ని రక్షించుకున్నారు. ఆ తరువాత ఏడాది జనవరి నెలలో ఇంటి బయట కూర్చొని ఉండగా.. మరోసారి పాము కాటు వేసింది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా కోలుకుంది. ఇక అప్పటి నుంచి ప్రణాళిని కంటి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఎక్కడికి వెళ్లనిచ్చేవారు కాదు.
అయితే.. శుక్రవారం హోళీ కావడంతో స్నేహితులతో కలిసి హోళీ ఆడుకుందామని బ్యాగులో రంగులను తెచ్చుకుంది. అయితే.. ఆ బ్యాగులోకి పాము ఎప్పుడు తెలీదు. ఈ విషయాన్ని గుర్తించని ప్రణాళి రంగులను తీసేందుకు బ్యాగులో చేయి పెట్టగా పాము కాటువేసింది. వెంటనే ప్రణాళిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రణాళి మృతి చెందింది. ఒక్కగానొక్క కుమారై మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అక్కడి వారిని కలిచివేసింది.