హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని కాలేజీల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రూ.2 వేల కోట్ల బకాయిలు విడుదల చేసే వరకూ కాలేజీల బంద్ కొనసాగిస్తామని, సెమిస్టర్ పరీక్షలనూ బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఈ బంద్‌లో కాలేజీలు పాల్గొనాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.
ఫీజు రీ-యింబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లులకు నిరసనగా నేటి నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల బంద్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి తెలిపారు. పెండింగ్ బిల్లుల కారణంగా కాలేజీలను నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. బకాయి బిల్లులను చెల్లిస్తామని 2 నెలల క్రితం ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు దానిని నెరవేర్చలేదని ఆయన చెప్పారు. ఇక మాటలు వినే పరిస్థితుల్లో లేమని, బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.