తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యూసుఫ్‌గూడలో అత్యధికంగా 36.3 డిగ్రీల సెల్సియస్, సికింద్రాబాద్‌లో 35.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) ప్రకారం.. రాబోయే కొద్ది రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత రెండు నుండి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది.
భారత వాతావరణ విభాగం కూడా హైదరాబాద్ నగరంలో రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు పొడి వాతావరణ పరిస్థితులను చూస్తుందని తెలిపింది. నగరంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్, 19 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. అయితే శుక్రవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి. సోమవారం భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 38.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలైన మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, ఖమ్మంలో పగటి ఉష్ణోగ్రతలు రానున్న కొద్ది రోజులలో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.