బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్
Dasoju Sravan joins BJP in presence of Tarun Chugh.కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ భారతీయ జనతా
By తోట వంశీ కుమార్
కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికార మార్పు అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యం దారి తప్పిందని, కేసీఆర్‌ను గద్దె దించాల్సిన సమయం దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు. సుపరిపాలన కోసం రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయని అభిప్రాయ పడ్డారు. శ్రవణ్ చేరికతో రాష్ట్రంలో బీజేపీ బలం మరింత పెరుగుతుందన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, బానిస బ్రతుకు బతకడం ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దాసోజు శ్రవణ్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడ్డానని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కులం, ధనం చూసి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన శ్రవణ్ ముఖ్య నాయకుల సమక్షంలో బీజేపీలో చేరారు.