రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర ఆలయం.. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి. రాజరాజేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారని భక్తుల విశ్వాసం. స్వామి వారిని దర్శించుకునేందుకు ఇక్కడికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే తాజాగా స్వామి వారి ఆలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం అర కిలోమీటర్ దూరంలోని భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు.
అర్జిత సేవలు, అభిషేకాలు, కోడె మొక్కులు, కుంకుమ పూజ, నిత్య కల్యాణం, చండీహోమం అక్కడే నిర్వహిస్తామన్నారు. రాజరాజేశ్వర ఆలయంలో స్వామి వారికి కేవలం ఏకాంత సేవలు జరుపుతామని ఆలయ అధికారులు వివరించారు. ఆలయంలో అభివద్ధి పనుల నేపథ్యంలో కలుగుతున్న అసౌకర్యానికి భక్తులు సహకరించాలని ఆలయ ఈవో పత్రికా ప్రకటనలో తెలిపారు. జన్న ఆలయ విస్తరణలో భాగంగా దర్శనాల నిలిపివేత కొన్ని నెలలు పాటు కొనసాగే అవకాశం ఉంది.