రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆలయ దర్శనాల వ్యవహారంలో అధికారులు తీసుకున్న నిర్ణయాలు భక్తులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం ఇప్పటికే ప్రధాన గర్భగుడిలో దర్శనాలను నిలిపివేసిన అధికారులు, ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశానికే అడ్డంకులు సృష్టించారు. తాజాగా ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులు ఏర్పాటు చేసి భక్తుల రాకను పూర్తిగా నిరోధించారు. ప్రస్తుతం స్వామి వారి చతుష్కాల పూజలకు అర్చకులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల నడుమ భీమేశ్వరాలయంలోనే తాత్కాలికంగా దర్శనాలు, కోడె మొక్కులు, ఇతర ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయి.
తాజాగా బుధవారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన ద్వారాన్ని కూడా రేకులతో మూసివేయడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దేవాదాయ శాఖ, ఆలయ అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో వేములవాడకు వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. అయితే పునర్నిర్మాణ పనుల పేరిట ఆలయ ద్వారం మూసివేయడంతో దర్శనాల కోసం వచ్చిన వారు నిరాశతో తిరుగు ప్రయాణం అవుతున్నారు. రాజన్న ఆలయానికి చేరుకున్న భక్తులు బయట ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌లకు మొక్కులు పెట్టి వెళ్లిపోతున్నారు.