Telangana: దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం
హైదరాబాద్: నగరానికి సమీపంలోని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో తనను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని దళిత మహిళ ఆరోపించింది.
By అంజి Published on 5 Aug 2024 10:28 AM ISTTelangana: దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం
హైదరాబాద్: నగరానికి సమీపంలోని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో తనను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని దళిత మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
బంగారం దొంగిలించారనే ఆరోపణలపై మహిళను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ఆమె మైనర్ కొడుకు సమక్షంలోనే చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
విలేఖరులతో మాట్లాడిన మహిళ.. తన భర్తను మొదట కొట్టి, ఆపై విడిచిపెట్టినట్లు పేర్కొంది. ఆ తర్వాత పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. పోలీసులు ఆమెపై దాడి చేసే ముందు కాళ్లు, చేతులు కట్టేశారు. ఎంత వేడుకున్నప్పటికీ, తనను విడిచిపెట్టలేదని మహిళ పేర్కొంది.
ఆరోపణలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతీ ప్రతిస్పందిస్తూ.. షాద్‌నగర్‌లోని డిఐ (డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్)పై వచ్చిన ఆరోపణలపై విచారణ పెండింగ్‌లో ఉన్నందున కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసినట్లు పోలీసుల నుండి ఒక ప్రకటన పేర్కొంది.
షాద్‌నగర్ ఏసీపీ దీనిపై విచారణ జరుపుతున్నారని, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటనలో తెలిపారు.
ఈ ఘటనపై భారత రాష్ట్ర సమితి నాయకుడు హరీశ్ రావు స్పందిస్తూ ట్వీట్ చేశారు. దళిత మహిళ సునీత, ఆమె భర్తను పోలీసులు తీవ్రమైన థర్డ్ డిగ్రీ హింసకు గురిచేశారని పేర్కొన్నారు. ఈ కారణంగానే వారు దొంగతనం చేసినట్లు ఒప్పుకోవలసి వచ్చిందన్నారు. ఈ భయంకరమైన అధికార దుర్వినియోగం సీఎం పర్యవేక్షణలో పోలీసుల క్రూరత్వం యొక్క ఆందోళనకరమైన ధోరణిని ప్రతిబింబిస్తోందన్నారు.
Police Abuse in Shadnagar: A Shameful Violation—Dalit woman Sunitha and her husband have been subjected to severe third-degree torture by police, forced to confess to a theft. This horrific abuse of power reflects a disturbing trend of police brutality under your watch,… https://t.co/xhnjFxwkVf pic.twitter.com/58hSv6dLQP
— Harish Rao Thanneeru (@BRSHarish) August 4, 2024
అసలేం జరిగిందంటే?
గత నెల 24 షాద్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి వారిపై దొంగతనం చేశారని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్య తో పాటు వారి 13 ఏళ్ళ కుమారుడు జగదీష్ నీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు. మైనర్ బాలుడు జగదీష్ ను కూడా చిత్రహింసల గురి చేశారు పోలీసులు. డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి, అతని సిబ్బంది బాధితురాలు సునీతను కుమారుడి ముందే విచక్షణ రహితంగా కొట్టడం తో తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సీఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టడం తో స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఇంటికి పంపించారని బాధితురాలు వాపోయింది. 24 తులాల బంగారం, 2 లక్షల నగదుకు గానూ కేవలం ఒక తులం బంగారం, నాలుగు వేల నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. మహిళ పై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా రిమాండ్ చెయ్యకుండా ఇంటికి పంపించి వేయడం వెనుక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపడటమే కారణంగా తెలుస్తుంది. ఒక వేళ నిజంగా దొంగతనం చేస్తే రిమాండ్ తరలించాలి గానీ ఒక దళిత పేద మహిళ పై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.