దళితుల ఉద్ధరణ కోసమే.. దళితబంధు: మంత్రి కేటీఆర్
దళితుల ఉద్ధరణ కోసమే.. తమ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందజేస్తామన్నారు.
By అంజి Published on 2 Oct 2023 5:53 AM GMTదళితుల ఉద్ధరణ కోసమే.. దళితబంధు: మంత్రి కేటీఆర్
దళితుల ఉద్ధరణ కోసమే.. తమ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు అందజేస్తామన్నారు. ఇది కేవలం దమ్మున్న నాయకులతోనే సాధ్యమవుతుందని అన్నారు. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌సాగర్ తీరంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర దళితబంధు పథకంలో భాగంగా జలమండలి 162 మురుగు వ్యర్థాల రవాణా వాహనాలను మంత్రి కేటీఆర్ లబ్దిదారులకు అందజేశారు. అలాగే వాహనాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ని లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదని అన్నారు. రానున్న రోజుల్లో అర్హులైన అందరికీ దళితబంధు సాయం అందిస్తామని చెప్పారు. మహాత్మ గాంధీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టామన్నారు. గాంధీ జయంత్రి సందర్భంగా 162 సిల్ట్ కార్టింగ్ వెహికల్స్‌ని అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వీటి కోసం కోటి రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేశామన్నారు. ప్రతి వాహనానికి జలమండలి పని కల్పిస్తుందని తెలిపారు. అలాగే 3 నెలలకు ఒకసారి వాహనాన్ని జలమండలి తనిఖీ చేస్తుందన్నారు.
మహాత్ముడుని.. ఆదర్శంగా తీసుకుని సీఎం కేసీఆర్ పరిపాలిస్తున్నారని చెప్పారు. శాంతియుత పోరాటం ద్వారానే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. గాంధీ ఫొటోలు పెట్టుకుని దేశ రాజధానిలో కొందరు నినాదాలు ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గాంధీజీ ఫొటోలకు పోజులు ఇవ్వడం తప్ప.. ఆచరించరని విమర్శించారు.