విషాదం.. మెదక్‌లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి

Cylinder gas explosion claims two lives in Medak. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఓ ఇంట్లో

By అంజి  Published on  25 Jan 2023 6:33 AM GMT
విషాదం.. మెదక్‌లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి

మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఓ మహిళ, ఆమె మనవరాలు మృతి చెందారు. మృతులు పిట్టల అంజమ్మ(52), మనవరాలు మధు(6)గా గుర్తించారు. అంజమ్మ తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోందని, వితంతు పింఛన్‌, రేషన్‌ బియ్యం తీసుకునేందుకు మంగళవారం స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం.పెన్షన్ తీసుకున్న అనంతరం మధుతో పాటు అంజమ్మ రాత్రి భోజనం చేసిన తర్వాత తన ఇంట్లోనే పడుకుంది.

అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. ఒక్కసారిగా ఇల్లంతా మంటలు వ్యాపించాయి. మంటల్లోనే అంజమ్మ, మధు ఇద్దరూ సజీవ దహనమయ్యారు. పేలుడు తీవ్రతకు ఇల్లు కుప్పకూలింది. అర్ధరాత్రి భారీ పేలుడు శబ్ధానికి గ్రామం మొత్తం మేల్కొంది. ఈ ఘటనపై చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ లీకేజీ వల్లే సిలిండర్ పేలిపోయి ఉంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంత దారుణంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఆ గ్రామంలో విషాదం నింపింది.

Next Story
Share it