తెలంగాణ రాష్ట్రంలోని హెయిర్ కటింగ్ షాపులు(సెలూన్), లాండ్రీలు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రజక, నాయీబ్రాహ్మణ సంఘాలు ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రం మొత్తానికి ఈ నిర్ణయం వర్తింపజేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న కటింగ్ షాపులు, లాండ్రీలు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్లవరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇస్తూ తక్షణం జీవో జారీకి చర్యలు తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని.. వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదివారం జీవో విడుదలచేశారు. ఈ నెల 1వ తేదీనుంచే ఉచిత విద్యుత్ సరఫరా అమల్లోకి వస్తుందని జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామస్థాయి నుంచి జీహెచ్‌ఎంసీ వరకు కులవృత్తిలో ఉన్న నాలుగున్నర లక్షలమంది రజకులకు, రెండున్నర లక్షలమంది నాయీబ్రాహ్మణులకు ప్రయోజనం కలుగుతుంది. ఉచిత విద్యుత్ వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.250 కోట్ల వరకు భారం పడనుందని అధికారులు అంచనావేశారు.