కుంగిన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి.. డ్యామ్‌ పరిసరాల్లో అలర్ట్

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి ఒక్కసారిగా కొంత మేర కుంగిపోయింది.

By అంజి  Published on  22 Oct 2023 3:45 AM GMT
Medigadda Barrage Bridge, Kaleshwaram project, Telangana

కుంగిన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి.. డ్యామ్‌ పరిసరాల్లో అలర్ట్

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి ఒక్కసారిగా కొంత మేర కుంగిపోయింది. బి- బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న బ్రిడ్జి ఒక అడుగు మేర కుంగింది. శనివారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు భారీ శబ్దం వచ్చింది. బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన బ్రిడ్జి కుంగినట్ట అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ పొడవు 1.6 కి.మీ. ఘటనా ప్రదేశం మహారాష్ట్ర వైపు నుండి 356 మీటర్ల దూరంలో ఉంది. బ్రిడ్జి కుంగడంతో నీటిపారుదల శాఖ అధికారులు డ్యామ్ పరిసరాల్లో అలర్ట్‌ ప్రకటించారు.

మరోవైపు మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. గోదావరి నదిపై భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో 2019లో మేడిగడ్డ దగ్గర నిర్మించిన ఈ బ్యారేజీ.. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. నిన్న రాత్రి సమయంలో ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా, 8 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. శబ్దం రావడంతో అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరిశీలిస్తున్న సమయంలోనూ మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని పైఅధికారులకు తెలియజేశారు.

16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో సంఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల నీరు ఉంది. రాత్రి టైంలో బ్రిడ్జి కుంగిన నేపథ్యంలో ఇంజినీర్లు ముందు జాగ్రత్త చర్యగా ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొదట 12 గేట్లు, ఆ తరువాత వాటిని 46కు పెంచి దిగువకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. దాదాపు 50 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కొంత మేరకు జలాశయాన్ని ఖాళీ చేసి బ్రిడ్జి కుంగిన ప్రాంతం దిగువన బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది ఇంజినీర్లు పరిశీలించనున్నారు.

బ్రిడ్జి కుంగిపోవ‌డంపై ఎల్ అండ్ టీ స్పందిస్తూ..

L&T తెలంగాణలో 2019 సంవత్సరంలో 86 పీర్స్ తో 1.632 కి.మీ పొడవైన లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ)ని నిర్మించింది. అప్పటి నుండి బ్యారేజీ పని చేస్తోంది. ఇటీవలి 2023 వరద సీజన్‌తో సహా గత ఐదు వరద సీజన్‌లను తట్టుకుంది.

మేడిగడ్డ బ్యారేజీ సామర్ధ్యం 28.25 L క్యూసెక్కులు కాగా.. గత సంవత్సరం సామ‌ర్ధ్యానికి మించి 28.70 లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. బ్యారేజీ రూపకల్పన రాష్ట్ర అధికారులదే. జులై 2022లో వరదలు వచ్చినప్పుడు కూడా బ్యారేజ్ సురక్షితంగా తట్టుకుని పని చేసింది.

నిన్న సాయంత్రం బ్యారేజీ బ్లాక్-7లోని ఒక చోట పెద్ద శబ్ధం రావడంతో వంతెన భాగం కుంగిపోవడం గమనించారు. రాష్ట్ర అధికారులతో కలిసి మా సాంకేతిక నిపుణుల బృందం కారణాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ప్రాజెక్ట్ సైట్‌కు పంపబడింది. కార‌ణాల‌ను అంచనా వేసిన తర్వాత నష్టాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యను ఎల్ అండ్ టీ తీసుకుంటుంది. వీలైనంత త్వరగా పరిష్కారానికి మార్గం చూపుతుందని ఎల్ అండ్ టీ పేర్కొంది.

Next Story