వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల పరిధిలోని జానంపేట్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున మొసలి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. ఐదు గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత.. అటవీ అధికారులు, సాగర్ స్నేక్ సొసైటీకి చెందిన వాలంటీర్ల సహాయంతో, మొసలిని విజయవంతంగా పట్టుకుని బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో వదిలారు.
తెల్లవారుజామున 3:45 గంటల ప్రాంతంలో వీధి కుక్కల ఎడతెగని అరుపులతో ఇంటి యజమాని నాగన్న నిద్ర లేచాడు. అదే సమయంలో బయటకు వచ్చి చూడగా.. తన బాత్రూమ్ సమీపంలో మొసలి కనిపించింది. భారీ మొసలిని చూసి కంగుతిన్న నాగన్న, వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. సమీపంలోని రామసముద్రం వాగు నుండి దారి తప్పి మొసలి జానంపేట్ వైపు వచ్చి ఉండవచ్చు.
నాగన్న వెంటనే 108కి డయల్ చేయడంతో అటవీ అధికారులు, సాగర్ స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన బీట్ కానిస్టేబుల్ రమేష్ పరిస్థితిని గమనించి హోంగార్డు, సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్ నేతృత్వంలోని బృందానికి సమాచారం అందించారు.
మొసలిని బంధించే సున్నితమైన ప్రక్రియను బృందం ప్రారంభించింది. దాని దృష్టిని నిరోధించడానికి మొదట దాని ముక్కును గుడ్డతో కప్పి, ఆపై ఎటువంటి దాడులు జరగకుండా దాని దవడలను తాడుతో భద్రపరిచారు. మొసలిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో గ్రామం నుంచి తరలించి కృష్ణానదిలోకి వదిలారు.