తెలంగాణ పోలీసులంటే నేరగాళ్లు వణికిపోవాలి: సీఎం రేవంత్‌

తెలంగాణలో పోలీసులు అంటే నేరగాళ్లు వణికిపోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అవలంభించాలని పోలీసులకు సూచించారు.

By అంజి  Published on  2 July 2024 10:15 AM GMT
Criminals, Telangana Police, CM Revanth Reddy

తెలంగాణ పోలీసులంటే నేరగాళ్లు వణికిపోవాలి: సీఎం రేవంత్‌

తెలంగాణలో పోలీసులు అంటే నేరగాళ్లు వణికిపోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అవలంభించాలని పోలీసులకు సూచించారు. డ్రగ్‌ పెడ్లర్లు, సైబర్‌ నేరగాళ్లు రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే భయపడాలన్నారు. సైబర్‌ క్రైమ్‌, డ్రగ్స్‌ నిందితులను పట్టుకున్న పోలీసులకు నగదు బహుమతి, పదోన్నతులు కల్పిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్‌ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని కంట్రోల్‌ కమాండ్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు.

డ్రగ్స్‌ నియంత్రణలో సెలబ్రిటీలు, థియేటర్‌ యజమానులు భాగమవ్వాలని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే సినీ నటులకు సీఎం కీలక సూచన చేశారు. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం వారి వంతు కృషి చేయాలని సూచించారు. బాధ్యతాయుతంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు సందేశం ఇచ్చే వీడియోలు విడుదల చేయాలని కోరారు. సమాజానికి వారి వంతుగా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌ కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు.

నేరాలను అరికట్టేందుకు కృషి చేసే అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామన్నారు. మీడియా కూడా డ్రగ్స్‌ నియంత్రణకు తమ వంతుగా సహకరించాలని కోరారు. డ్రగ్స్‌ నియంత్రణపై చిరంజీవి చేసిన ప్రత్యేక వీడియోకు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు.. హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నార్కోటిక్ బ్యూరో ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్‌ తిలకించారు. మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని వాల్‌ బోర్డుపై సీఎం రాశారు.

Next Story