భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని ఓడించే సత్తా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ మద్దతు టీఆర్ఎస్‌కు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. శనివారం ఉదయం చాడ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చే అంశం కేవలం మునుగోడుకే పరిమితం కాబోదన్నారు. భవిష్యత్తులోనూ ఆ పార్టీతో కలిసి నడుస్తామన్నారు.
ఉప ఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదని, అందుకనే టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఇక మునుగోడు బహిరంగ సభకు రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలిపారు. సీపీఐ తరుపున పల్లా వెంకట్‌రెడ్డి సభలో పాల్గొంటారన్నారు. రాజగోపాల్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనం కోసమే రాజీనామా చేశారని విమర్శించారు. అందుకే ఉప ఎన్నిక వచ్చిందన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమను ఇబ్బంది పెట్టిందని తెలిపారు. మాకు కేటాయించిన మూడు సీట్లలో కూడా వారి అభ్యర్థులు పోటీచేశారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ ఇబ్బంది పెట్టారని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.