కేసీఆర్‌కు షాక్‌.. రేవంత్‌ యాత్రలో సీపీఐ, ఏఐటీయూసీ నేతలు

CPI & AITUC extends support to Haath se Haath Jodo yatra. భద్రాద్రి: బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు

By అంజి  Published on  13 Feb 2023 10:32 AM GMT
కేసీఆర్‌కు షాక్‌.. రేవంత్‌ యాత్రలో సీపీఐ, ఏఐటీయూసీ నేతలు

భద్రాద్రి: బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు షాక్‌ ఇస్తూ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తలపెట్టిన ' హాత్‌ సే హాత్‌ జోడో ' పాదయాత్రలో సీపీఐ సోమవారం పాల్గొంది. సోమవారం భద్రాద్రి పినపాకలో రేవంత్‌రెడ్డి తన యాత్రను కొనసాగించారు. కాగా ఆశ్చర్యపరుస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) నాయకులు, కార్యకర్తలు రేవంత్‌ రెడ్డి పాదయాత్రకు మద్దతు తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలపాలని రేవంత్ రెడ్డిని సీపీఐ నేతలు కోరారు.

కాగా పాదయాత్రలో కాంగ్రెస్‌, సీపీఐ శ్రేణుల కలయిక ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు సీపీఐ, ఏఐటీయూసీ మద్దతు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుని తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇసుక మాఫియా, భూమాఫియా, ధరణి పోర్టల్‌ వల్ల ఏర్పడే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీపీఐ నేత ఒకరు మీడియాకు తెలిపారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజల నమ్మకాన్ని తాకట్టు పెట్టారని, ప్రజల జీవితాల్లో చీకట్లు నింపారని రేవంత్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతీవర్గం బాధలో ఉందన్నారు.

ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి హత్ సే హాత్ జోడో ప్రచారంలో భాగంగా కొనసాగుతున్న పాదయాత్రతో ఊపందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ యాసిడ్ పరీక్షను ఎదుర్కొంటోంది. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని భావించిన కాంగ్రెస్‌కు వరుసగా మూడో ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? అనేది మరికొన్ని నెలల్లో తేలనుంది.

Next Story