కొవిషీల్డ్ ఎక్స్‌పైరీ తేదీ ఎప్పుడంటే..?
Covishield vaccine expiry date. కొవిషీల్డ్ ఎక్స్‌పైరీ తేదీ ఎప్పుడంటే,ఈ టీకా కాలపరిమితి 29 మార్చి 2021.
By తోట వంశీ కుమార్ Published on 13 Jan 2021 10:43 AM ISTతినే ఆహారపదార్థాల నుంచి మెడిసిన్ వరకు ప్రతి దానికి ఓ కాలపరిమితి ఉంటుంది. ఆ నిర్ణీత కాల పరిధిలోనే ఆ వస్తువును వినియోగించాలి. ఆ కాలపరిమితి దాటిన తరువాత వినియోగిస్తే.. సమస్యలు వస్తాయి. అందుకని ప్రతి దానిపై ఖచ్చితంగా తయారీ తేదీతో పాటు ఎక్స్‌ఫైరీ తేదీ ని ముద్రిస్తారు. ఇక ఆస్పత్రిలో వినియోగించే ప్రతి మెడిసిన్‌ను కూడా ఒకటికి పది సార్లు చెక్ చేసిన తరువాత మాత్రమే వినియోగిస్తారు. కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ టీకా.. 3.64 లక్షల డోసులు మంగళవారం భాగ్యనగరానికి చేరుకుంది. పటిష్ట భద్రత నడుమ కోఠిలోని ఆరోగ్య సంక్షమ కార్యాలయంలోని ప్రధాన అతి శీతల గిడ్డంగికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ టీకాను ఎప్పుడు తయారు చేశారు..? ఎన్ని రోజుల వరకు దీనిని వినియోగించవచ్చు..? ఒక్కో టీకా పరిమాణం ఎంత..? అనే అంశాలను తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. కొవిషీల్డ్ టీకాను 1 నవంబర్ 2020న సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసింది. ఈ టీకా కాలపరిమితి 29 మార్చి 2021. ఒక్కో వయల్‌లో 5 ఎంఎల్ పరిమాణం టీకా ఉండగా.. దానిని 10 డోసులుగా వేయనున్నారు. ఒక్కసారి తెలిస్తే 4గంటల్లోపే వినియోగించాలి.
రాష్ట్రంలో 3.30లక్షల మంది ప్రభుత్వ, ప్రవేటు వైద్య సిబ్బందికి మాత్రమే తొలి విడుతగాఈ వ్యాక్సిన్ అందజేయనున్నారు. వీరి కోసం తొలి రోజు (16న) 139 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 17 ఆదివారం సెలవు. 18 నుంచి తిరిగి కార్యక్రమం మొదలవుతుంది. సోమవారం నుంచి టీకా పంపిణీ కేంద్రాల సంఖ్యను 1213 కేంద్రాలకు పెంచనున్నారు. వారానికి నాలుగు రోజులు మాత్రమే (సోమ, మంగళ, గురు, శుక్ర) వ్యాక్సిన్ అందజేయనున్నారు. తొలి రోజు ప్రతి కేంద్రంలోనూ కేవలం 30 మందికే టీకాలను పంపిణీ చేయనున్నారు. తర్వాత కూడా రోజుకు 30 నుంచి 50 మందికి ఇస్తారు. తొలివారంలో రోజుకు గరిష్టంగా 50 మందికి మించి పంపిణీ చేయకూడదని తీర్మానించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. తొందరపడి పెద్ద సంఖ్యలో టీకాలను పంపిణీ చేస్తే.. ఒకవేళ అనుకోని విపత్తు ఏర్పడి, దుష్ఫలితాలు ఎదురైతే.. అపవాదు ఎదుర్కోవాల్సి వస్తోందనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.